Supreme Court | రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుచిరా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రిక్రూట్మెంట్ స్కామ్‌లో డబ్బు లావాదేవీల అంశంపై విచారణకు ఈడీ అభిషేక్ బెనర్జీని విచారణకు పిలిచినా.. ఆయన హాజరుకాలేదు. ఇదే కేసులో ఆయన భార్య రుచిరాను ఈడీ పలుసార్లు ప్రశ్నించింది. ఈ కేసులో ఈడీ తరఫున న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. అభిషేక్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. న్యాయవాది హుస్సేన్ స్పందిస్తూ విచారణ, సమన్లు ప్రత్యేక చట్టం పరిధిలోకి రావని చెప్పారు. సెక్షన్ 50 ప్రకారం అధికారం ఇవ్వవచ్చన్నారు. సెక్షన్ 50 పీఎంఎల్ఏ సెక్షన్ 160 సీఆర్పీసీలాంటిది కాదని హుస్సేన్ పేర్కొన్నారు. ప్రత్యేక నిబంధన అయినందున సెక్షన్ 50 చెల్లుబాటు అవుతుందన్నారు.
ఈ సెక్షన్ ద్వారా ఎవరినైనా విచారణకు పిలవవచ్చన్నారు. అభిషేక్ బెనర్జీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. తాము లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదన్నారు. సమన్ల ప్రక్రియ సెక్షన్ 50లో నిర్దేశించబడలేదని.. దానికి సమాధానం ఇవ్వలేదన్నారు. దీనికి జస్టిస్ త్రివేది స్పందిస్తూ సమన్ల ఫార్మాట్‌పైనే ఆధారపడుతామనగా.. కోడ్‌కు విరుద్ధంగా లేదని సీనియర్ న్యాయవాది తెలిపారు. సెక్షన్ 160 సీఆర్పీసీ నిందితులు, సాక్షి ఇద్దరికీ వర్తిస్తుందన్నారు. కోల్‌కతాలో ప్రశ్నించడం వల్ల ఎలాంటి దురభిప్రాయం కలిగిందనే ప్రాథమిక ప్రశ్నకు సమాధానం చెప్పలేదని సిబల్ పేర్కొన్నారు. సమాచారం కావాలంటే అడగవచ్చని.. ఇప్పటికే కోల్‌కతాలో విచారించారన్నారు. ప్రక్రియ అధికారం ఉద్దేశం కాదని.. ఆర్టికల్ 31, సీఆర్పీసీకి విరుద్ధమైన ప్రక్రియను ఈడీ ఉపయోగిస్తుందన్నారు. సమన్లను రద్దు చేయాలని కోర్టును కోరారు.