Manish Sisodia | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కీలకనేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Liquor Policy Case) బెయిల్ షరతులను (bail condition) సుప్రీంకోర్టు (Supreme Court) సడలించింది. ఈ మేరకు బుధవారం సిసోడియాకు రిలీఫ్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సిసోడియా ఇకపై వారంలో రెండుసార్లు దర్యాప్తు సంస్థల ఎదుట హాజరుకావాల్సిన అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అయితే, కేసు విచారణకు మాత్రం హాజరుకావాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, న్యాయవాది వివేక్‌జైన్ వాదించారు. ప్రతి సోమ, గురువారాల్లో సిసోడియాకు పోలీసుల ముందు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. సిసోడియా ఇప్పటికే దాదాపుగా 60 సార్లు హాజరయ్యారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారెవరికీ ఇలాంటి షరతు విధించలేదని సింఘ్వీ వివరించారు. వాదనలు విన్న కేవీ విశ్వనాథన్, బీఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ షరతులను సడలించింది.
కాగా, ఈ కేసులో సిసోడియా షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వారంలో రెండు రోజులు అంటే ప్రతి సోమ, గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య విచారణ అధికారికి రిపోర్ట్ చేయాలని షరతు ఉంది. ఇప్పుడు ఆ షరతును సుప్రీంకోర్టు సడలించింది.
Also Read..
Arvind Kejriwal | అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ఆస్కారం లేదు.. ఒంటరిగానే పోటీ : కేజ్రీవాల్