న్యూఢిల్లీ, మే 2: బీజేపీ, ఆరెస్సెస్ ఎజెండాలో భాగంగానే ‘ది కేరళ స్టోరీ’ రూపొందించారని కేరళ సీపీఎం నేతలు విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాన్ని వ్యాప్తి చేసే ఎజెండాలో భాగంగానే బీజేపీ ఈ సినిమాను తీసుకొచ్చిందని రాష్ట్ర సీపీఎం శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. కేరళ స్టోరీ సినిమా కథాంశాన్ని అధికారిక సీపీఎంతో పాటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కన్నూర్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ విలేకర్లతో మాట్లాడుతూ, ‘32 వేల మంది మహిళలు కేరళ నుంచి మిస్సింగ్ అయ్యారని అంటున్నారు. ఈ సినిమా ద్వారా బీజేపీ,ఆరెస్సెస్ రాష్ట్ర ప్రజల మనస్సుల్లో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నాల్ని ప్రజలు అడ్డుకోవాలి’ అని అన్నారు. ఇదిలా ఉండగా, సినిమా విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. విద్వేష ప్రసంగం ఉందన్న ప్రాతిపదికన సినిమా విడుదలపై ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొన్నది. ఫిలింబోర్డ్ సర్టిఫికెట్ ఇచ్చింది, దీనిని సవాల్ చేయవచ్చునని సూచించింది.