న్యూఢిల్లీ: రిజర్వేషన్ల అమలు విషయంలో బీహార్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. నితీశ్ కుమార్ ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారికి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అయితే ఈ చట్టం చెల్లదంటూ పాట్నా హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు నిర్ణయంపై స్టే విధించేందుకు నిరాకరించింది. కేసును సెప్టెంబర్లో విచారిస్తామని వెల్లడించింది.