Bhavani Revanna | లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆమెకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం భవానీ రేవణ్ణకు నోటీసులు జారీ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. అయితే, ఈ కేసులు రాజకీయం చేయొద్దని ధర్మాసనం మొదట పేర్కొంది. సిట్ విజ్ఞప్తి మేరకు భవానీ రేవణ్ణకు నోటీసులు జారీ చేసేందుకు అంగీకరించింది. సిట్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
భవానీ రేవణ్ణకు హైకోర్టు ఉపశమనం కల్పించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దాంతో జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ రాజకీయ కారణాలను పక్కనపెట్టి.. హైకోర్టు పేర్కొన్న కారణాలను చూడాలని సూచించారు. నిందితురాలు మహిళ అని, 55 ఏళ్ల వయస్సు ఉంటుందని.. లైంగిన దాడికి పాల్పడ్డట్లు ఆమె కొడుకుపై ఆరోపణలున్నాయని.. మొదట పారిపోయాడని.. ఆ తర్వాత పట్టుబడినట్లు పేర్కొన్నారు. కొడుకు చేసిన నేరాలను ప్రోత్సహించడంలో తల్లి పాత్ర ఏంటీ? ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయా? నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటూ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారని, బాధితురాలి నిర్బంధించడంలో భవానీ రేవణ్ణ పాత్ర ప్రస్తావనలో ఉందని ధర్మాసనానికి దృష్టికి సిబల్ తీసుకెళ్లారు.
మళ్లీ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ఓ మహిళకు ఉన్న స్వేచ్ఛ అంశాన్నే తాము పరిశీలిస్తున్నామని.. దోషి అయితే అంతిమంగా విచారణలో తేలుతుందన్నారు. సిబల్ వాదనలు వినిపిస్తూ మహిళ అనే కారణంగా ఆమెకు నేరంలో ప్రమేయం లేదనే అభిప్రాయానికి బెంచ్ రాకూడదని వాదించారు. ఆ తర్వాత భవానీ రేవణ్ణకు నోటీసులు పంపేందుకు ధర్మాసనం అంగీకరించింది. ఇదిలా ఉండగా.. మాజీ ప్రధాని హెడీ దేవెగౌడ మనువడైన ప్రజ్వల్ రేవణ్ణ పలువురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏప్రిల్ 27న జర్మనీకి వెళ్లారు. ఆ తర్వాత సీబీఐ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో మాజీ ఎంపీపై ప్రత్యేక కోర్టు మే 18న అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.