Farmers Suicide | దేశానికి అన్నం పెట్టే రైతన్నల ఆత్మహత్యలు (Farmers Suicide) కలవరానికి గురి చేస్తున్నాయి. తీవ్ర కరవు, అప్పుల భారం, పంట నష్టం వంటి కారణాల వల్ల రైతన్నలు ప్రాణాలు తీసుకుంటున్నారు. వ్యవసాయం చేయలేక, అప్పులు తీర్చలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా ఎన్డీయే కూటమి పాలిత మహారాష్ట్ర (Maharashtra)లో రైతుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి.
అధికారిక నివేదిక ప్రకారం.. మహారాష్ట్రలోని అమరావతి పరిపాలనా (Amravati division) విభాగం పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకూ 500 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. డివిజన్లోని అమరావతి, అకోలా, బుల్దానా, వాసిమ్, యవత్మాల్ జిల్లాల్లో ఈ ఏడాది జనవరి – జూన్ మధ్య కాలంలో ఏకంగా 557 మంది రైతులు తనువుచాలించారు.
వీరిలో అత్యధికంగా అమరావతి జిల్లాలో 170 మందికాగా, యవత్మాల్లో 150 మంది, బుల్దానాలో 111 మంది, అకోలాలో 92, వాసిమ్లో 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి 53 కేసుల్లో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించింది. సుమారు 284 కేసులు పెండింగ్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
రైతుల ఆత్మహత్య ఘటనలపై అమరావతి లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నాయకుడు బల్వంత్ వాంఖడే (Balwant Wankhade) స్పందించారు. రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటని అన్నారు. అయితే, రాష్ట్రంలో అమరావతి అగ్రస్థానంలో ఉందన్నారు. పంట నష్టం, తగిన వర్షపాతం లేకపోవడం, అప్పుల భారం, సకాలంలో వ్యవసాయ రుణాలు లేకపోవటం వంటి ప్రధాన కారణాలు రైతులను ఆత్మహత్య దిశగా నడిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే చొరవతీసుకొని రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చి వారికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read..
Bengaluru Metro | బెంగళూరు మెట్రోలో ఘర్షణ.. బాక్సింగ్ తరహాలో కొట్టుకున్న ప్రయాణికులు.. వీడియో
Bull | పోలీస్ స్టేషన్ పైకప్పుపైకి ఎక్కిన ఎద్దు..!
Anant Weds Radhika | అంబానీ ఇంట హల్దీ వేడుకలు.. పూల దుపట్టాతో మెరిసిన రాధికా మర్చెంట్