Supreme Court | తమిళనాడు మద్యం కుంభకోణం కేసు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను ఈడీ లాక్కుంటుందా..? అలా చేయడం సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం కాదా? అంటూ ఘాటుగా స్పందించింది. మద్యం రిటైలర్ ‘టాస్మాక్’ (TASMAC)లో అవకతవకలపై తమిళనాడు పోలీసులు, అవినీతి నిరోధకశాఖ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నాయి. అయితే, ఆయా కేసుల ఆధారంగా ఈడీ సైతం మనీలాండరింగ్ కింద కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో సంస్థకు సంబంధించిన కార్యాలయంలోనూ సోదాలు జరిపింది. అలాగే, మే మాసంలో సంబంధిత అధికారుల ఇండ్లల్లోనూ సోదాలు చేసింది. తనిఖీల్లో తమకు ఆధారాలు లభించినట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది.
అయితే, ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ తీరును తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్లు దాఖలు చేసి దర్యాప్తు చేస్తోందని.. ఈ విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? రాష్ట్ర పోలీసుల హక్కులను ఉల్లంఘించడం లేదా..? మీకు అనుమానం వచ్చినప్పుడల్లా మీరే వెళ్లి సొంతంగా దర్యాప్తు చేస్తారా? సమాఖ్య వ్యవస్థకు ఏమైంది..? ఈ కేసుపై ప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదా? శాంతి భద్రతలను ఎవరు నియంత్రిస్తారు ? అంటూ సీజేఐ ప్రశ్నల వర్షం కురిపించారు. గత ఆరు సంవత్సరాలుగా తాను ఈడీకి సంబంధించిన అనేక కేసులను చూశానని.. కానీ, తాను ఇప్పుడు ఇంకేమీ చెప్పలేనని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఈ కేసులో తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు తెలిపారు. ఈడీ టాస్మాక్ కార్యాలయంపై దాడి చేసి, ఉద్యోగుల మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకుందని చెప్పారు. మహిళా ఉద్యోగులను కూడా గంటల తరబడి నిర్బంధించారని.. ఇది గోపత్య ఉల్లంఘన అంటూ వాదించారు. ఈ సందర్భంగా మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 66(2)ని కపిల్ సిబల్ ప్రస్తావించారు. ఈడీ ఏదైనా ఇతర నేరానికి సంబంధించిన ఆధారాలను గుర్తిస్తే.. ఆ సమాచారాన్ని సంబంధిత ఏజెన్సీతో పంచుకోవాలని సెక్షన్ చెబుతోందన్నారు. కోర్టు కోర్టు మందలింపు తర్వాత ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. తమిళనాడు పోలీసులు 47 కేసులు నమోదు చేశారని.. ఇంకా అవినీతి కొనసాగుతుందని పేర్కొన్నారు. తాము మనీలాండరింగ్‌పై మాత్రమే దర్యాప్తు జరుపుతున్నామన్నారు. పెద్ద మొత్తంలో అక్రమ నగదు, నకిలీ పత్రాలు, ఒప్పంద అక్రమాలకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లుగా కోర్టుకు తెలిపారు.
ఈడీ వాదనల తర్వాత సీజేఐ స్పందిస్తూ.. మీకు ఆధారాలు దొరికితే.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించలేదు? అని ప్రశ్నించారు. న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఫోన్లు, చాట్స్‌ను ఈడీ తీసుకుందని.. మరి వాటిని ఎందుకు తిరిగి ఇవ్వరు? అని ప్రశ్నించారు. డీఎంకే ప్రభుత్వం, టాస్మాక్ మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 23న ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఈడీ విచారణపై స్టే విధించగా.. తాజాగా ఈ అంశంపై మరోసారి విచారణ జరిగింది. గతంలో జారీ చేసిన స్టేను పొడిగించింది. చాలా కేసుల్లో టాస్మాక్ ఫిర్యాదుదారేనని.. నిందితుడు కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. పీఎంఎల్ఏ కింద దర్యాపు చేసే హక్కు ఈడీకి లేదన్నారు. టాస్మాక్‌లో రూ.వెయ్యి కోట్ల విలువైన లెక్కలో లేని నగదు దొరికిందని ఈడీ ఆరోపించింది. కొన్ని డిస్టిలరీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకు కాంట్రాక్టులను తారుమారు చేశారని.. ప్రతి మద్యం బాటిల్‌పై రూ.10 నుంచి రూ.30 అక్రమంగా వసూలు చేశారని.. అధికారుల సహకారంతోనే ఇదంతా జరిగిందని ఈడీ వాదిస్తున్నది.