NEET UG | న్యూఢిల్లీ, జూన్ 14: నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్ష ప్రశ్నాపత్రం లీక్, అక్రమాలపై హితెన్ సింగ్ కశ్యప్‌తో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది.
ఇది 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయమని, సీబీఐ విచారణ జరిపించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, ఈ విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని, అన్ని అంశాలు తమ దృష్టిలో ఉన్నాయని కోర్టు పేర్కొన్నది. ఈ సందర్భంగా నీట్ పరీక్ష శిక్షణకు కేంద్రంగా ఉన్న రాజస్థాన్‌లోని కోటాలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను న్యాయవాది ప్రస్తావించగా కోర్టు అడ్డుకుంది. అనవసరమైన భావోద్వేగ వాదనలు చేయవద్దని, నీట్ ఫలితాల వల్ల కోటాలో ఆత్మహత్యలు జరగడం లేదని జస్టిస్ విక్రమ్‌నాథ్ పేర్కొన్నారు. సీబీఐ విచారణ జరిపించడంపై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్రం, ఎన్టీఏతో పాటు సీబీఐ, బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ కేసును జూలై 8న సాధారణ ధర్మాసనం విచారిస్తుందని తెలిపింది.
నీట్-యూజీ పరీక్షపై వేర్వేరు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా ఎన్టీఏ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం వెకేషన్ బెంచ్ విచారించింది. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా హైకోర్టులను ఆశ్రయించిన పిటిషన్‌దారులను ఆదేశించింది. మొత్తం పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్టీఏ తరపున న్యాయవాది కోర్టును కోరారు.
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కాకపోతే బీహార్‌లో 13 మందిని పేపర్ లీక్ చేశారని ఎందుకు అరెస్టు చేశారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. పేపర్లు ఇచ్చిన ముఠాకు రూ.30 – రూ.50 లక్షలు అందిన వైనాన్ని పట్నా పోలీసులు బయటపెట్టలేదా అని అడిగారు. గుజరాత్‌లోని గోద్రాలోనూ నీట్-యూజీ చీటింగ్ రాకెట్ పట్టుబడలేదా? అని ప్రశ్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎన్టీఏ ద్వారా నీట్ కుంభకోణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌ను, అక్రమాలను తమ ప్రభుత్వం ఉపేక్షించబోదని, ఎన్టీఏ జవాబుదారీతనానికి సంబంధించి ఏమైనా లోపాలు గుర్తిస్తే సరిదిద్దుతామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ ఏడాది సిలబస్ తక్కువ కావడం, అభ్యర్థుల సంఖ్య పెరగడం వల్ల పోటీ పెరిగిందని, టాప్ ర్యాంకర్లు పెరిగారని ఆయన స్పష్టత ఇచ్చారు.
విద్యను మాత్రమే ఎవరూ దొంగలించలేరని, అయితే ఇప్పుడు నీట్ లాంటి పరీక్షల్లోనూ కుంభకోణాలు జరుగుతున్నాయని, దీనిని బలంగా వ్యతిరేకించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. నీట్ అనేది ఒక కుంభకోణం అని తమిళనాడు మొదట చెప్పిందని, ఇప్పుడు దేశమంతా చెప్తున్నదని ఆయన అన్నారు.