న్యూఢిల్లీ: అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించకుండా అమెరికా మాదిరిగా భారత్ కూడా ఒక సరిహద్దు గోడను నిర్మించాలనుకుంటున్నదా? అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నించింది. అక్రమ వలసదారులను ముఖ్యంగా బంగ్లాదేశ్‌కు బహిష్కరించడంలో ప్రభుత్వాలు అనుసరించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల గురించి కేంద్రానికి తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మాల్య బాగ్చి, విఫుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం కోరింది.
ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వాన్ని కూడా ఒక పార్టీగా చేరుస్తున్నట్టు తెలిపింది. బంగ్లాదేశ్ జాతీయులు అనే అనుమానంతో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను అదుపులోకి తీసుకున్నారంటూ పశ్చిమ బెంగాల్ వలస సంక్షేమ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధిత పక్షాలు ఎవరూ కోర్టు ముందు హాజరు కాలేదని ఆయన చెప్పారు. కాగా, బహుశా నగదు వనరులు లేనందున వారు న్యాయస్థానానికి హాజరుకాలేకపోయి ఉండవచ్చునని కోర్టు అభిప్రాయపడింది.