న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా(Green Crackers) అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దీపావళి పండుగ నేపథ్యంలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు అని ఇవాళ కోర్టు చెప్పింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాలకు ఈ తీర్పు వర్తిస్తుంది. సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఇవాళ ఆ తీర్పునిచ్చింది. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. అయితే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ బాణాసంచా కాల్చుకోవచ్చు అని కోర్టు చెప్పింది.
కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మాలని, క్యూఆర్ కోడ్లతో అనుమతి ఉన్న బాణాసంచాను మాత్రమే అమ్మేవిధంగా చర్యలు తీసుకోవాలని, పోలీసు విభాగానికి చెందిన పెట్రోలింగ్ బృందాలు నిఘా పెట్టాలని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నది. ఈ-కామర్స్ వెబ్సైట్ల నుంచి బాణా సంచా అమ్మకాలను నిషేధిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది.
బాణాసంచా వినియోగంపై పూర్తి నిషేధాన్ని విధిస్తే .. ఆ క్రాకర్స్‌ను స్మగ్లింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ధర్మాసనం పేర్కొన్నది. అర్జున్ గోపాల్ కేసులో తీర్పు తర్వాత ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ పేల్చడానికి అనుమతి కల్పించారు. దీని వల్ల గత ఆరేళ్ల నుంచి కాలుష్యం తగ్గినట్లు కోర్టు చెప్పింది.