న్యూఢిల్లీ, మార్చి 26: వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తాడును లాగడం అత్యాచారం కిందకు రాదని వ్యాఖ్యానిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో సున్నితత్వం లోపించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తీర్పులోని కొన్ని వ్యాఖ్యలు తమను బాధించాయని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ మాసిహ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంపై కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి సమాధానాలను సుప్రీం కోరింది. తీర్పు రాసిన రచయితలో సున్నితత్వం పూర్తిగా లోపించిందని చెప్పడానికి తాము బాధపడుతున్నామని ధర్మాసనం తెలిపింది.
ఇది హడావుడిగా ఇచ్చిన తీర్పు కూడా కాదని, నాలుగు మాసాలపాటు రిజర్వ్‌లో ఉంచిన తర్వాత ఇచ్చిన తీర్పని వారు తెలిపారు. ఈ దశలో స్టే ఇవ్వడం తమకు ఇష్టం లేదని, అయితే 21, 24, 26 పేరాగ్రాఫ్లలో ఉన్న కొన్ని వ్యాఖ్యలు చట్టానికి కొత్తవని, అమానుషంగా ఉన్నాయని, అందుకే తాము తీర్పుపై స్టే ఇస్తున్నామని ధర్మాసనం వెల్లడించింది. ధర్మాసనం అభిప్రాయంతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఏకీభవించారు.
హైకోర్టు జడ్జి తీర్పులో సున్నితత్వం పూర్తిగా కొరవడిందని జస్టిస్ గవాయ్ అన్నారు. సమన్లు జారీ చేసే అంశమని, న్యాయమూర్తిపై ఇటువంటి కఠినమైన పదాలు ఉపయోగిస్తున్నందుకు తమను క్షమించాలని తెలిపారు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును వి ద వుమెన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ చేసిన విమర్శలను సుమోటోగా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
బాధితురాలి తల్లి కూడా అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు చేయగా సుమోటో కేసులో దాన్ని కూడా కోర్టు చేర్చింది. తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు తీర్పు మార్చి 17న వెలువడింది. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఈ తీర్పు ఇచ్చారు. అత్యాచార నేరానికి సంబంధించిన ఐపీసీలోని సెక్షన్ 376 కింద తనకు కింది కోర్టు సమన్లు జారీచేయడాన్ని సవాలు చేస్తూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారు. నిందితులు పవన్, ఆకాశ్ బాధితురాలి వక్షోజాలను పట్టుకుని ఆమె పైజామాను కిందకు లాగడానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో ఆమె పైజామా తాడును నిందితులు తెంచేశారు. బాలికను కాలువ కిందకు లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సాక్షులు జోక్యం చేసుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్టు అభియోగాలు నమోదయ్యాయి. నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఈ వాస్తవాలను బట్టి చూస్తే బాధితురాలిపై అత్యాచారం చేయాలన్న ఉద్దేశం నిందితులకు ఉన్నట్టు నిర్ణయించలేమని అన్నారు. ఇంతకు మించి బాధితురాలిపై అత్యాచారం జరిపేందుకు నిందితులు వేరే ఏ రకమైన చర్యలకు పాల్పడలేదని హైకోర్టు తీర్పులోని 21వ పేరా పేర్కొంది. దీన్నే ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది.