న్యూఢిల్లీ: యూట్యూబర్ రణ్వీర్ అల్లబదియా(Ranveer Allahbadia)కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. పాస్‌పోర్టును అతనికి ఇచ్చేయాలని కోర్టు ఇవాళ ఆదేశించింది. అతనిపై నమోదు అయిన కేసుల్లో విచారణ పూర్తి అయిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబర్ అల్లబదియా.. బీర్‌బైసెప్స్ షోతో పేరుగాంచిన విషయం తెలిసిందే. విదేశీ ప్రయాణం నేపథ్యంలో అతనికి పాస్‌పోర్టును అప్పగించాలని కోర్టు పోలీసుల్ని ఆదేశించింది.
జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటేవ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అస్సాం, మహారాష్ట్ర ప్రభుత్వాలు విచారణ పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి. పాస్‌పోర్టు కోసం మహారాష్ట్ర సైబర్ క్రైం బ్యూరోకు వెళ్లాలని కోర్టు ఆదేశించింది. అల్లబదియా తరపున సీనియర్ న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ వాదించారు. అల్లబదియాపై నమోదు అయిన కేసులన్నీ ఒక్కచోటకు చేర్చాలన్న అడ్వకేట్ అభ్యర్థనను స్వీకరిస్తున్నట్లు కోర్టు చెప్పింది.
ఓ యూట్యూబ్ షోలో తల్లితండ్రుల శృంగారంపై అనుచిత కామెంట్ చేసిన అల్లబదియాపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే ఫిబ్రవరి 18వ తేదీన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అల్లబదియాను అరెస్టు చేయవద్దు అని పేర్కొన్నది. థానే పోలీసు స్టేషన్లో పాస్‌పోర్టును డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అయితే విలువలు, హుందాతనంతో ద రణ్వీర్ షోను నడుపుకోవచ్చు అని మార్చి 3వ తేదీన సుప్రీంకోర్టు అల్లబదియాకు తెలిపింది.