న్యూఢిల్లీ: మణిపూర్ ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకొని వారికి భరోసా కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అల్లర్ల కారణంగా దెబ్బతిన్న గ్రామలు, ప్రార్థనాలయాల పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని చెప్పింది. ‘అన్ని పార్టీల ప్రతినిధులు తమ ప్రసంగాల్లో విద్వేషాలకు తావివ్వకూడదు’ అని కోర్టు తెలిపింది.
భద్రతా దళాలను ఎక్కడ మోహరించాలని నిర్ణయించడం కోర్టు పని కాదని పేర్కొంది. కేసు విచారణ సందర్భంగా వివిధ వర్గాల న్యాయవాదులు చేసిన సూచనలు, సలహాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోనికి తీసుకోవాలని సూచించింది. సహాయక శిబిరాల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కమిటీల్లో కుకీ మైనారిటీ వర్గానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. ఈ కేసు విచారణలో న్యాయవాదులు ఇచ్చిన సలహాలను ఒక వారంలోగా అమలు చేసి అందుకు సంబంధించిన నివేదికను తమకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.