న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి పెమా ఖాండూ తన కుటుంబ సభ్యులు, బంధువులకు అక్రమంగా ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సోమవారం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సుమారు రూ.1,270 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను ఆయన తన కుటుంబసభ్యులు, బంధువులకు అప్పనంగా అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సేవ్ మాన్ రీజియన్ ఫెడరేషన్, వలంటరీ అరుణాచల్ సేనలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేయాలని కోరాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.
అంతేకాకుండా 2015-2025 మధ్య జరిగిన కాంట్రాక్టు పనులు ఎవరికి కట్టబెట్టారు, వాటిని ఎవరు చేశారు? తదితర వివరాలను అందజేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కాగా, ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ ముఖ్యమంత్రి భార్య, అతని తల్లి, మేనల్లుడు, ఇతర బంధువులకు చెందిన సంస్థలకు అప్పగించారంటూ పిటిషనర్లు ఆరోపించారు. ప్రభుత్వ పనుల టెండర్లు, ప్రాజెక్టులు అమలైన విధానం, నిధుల చెల్లింపు ఎలా జరిగింది? తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ దర్యాప్తునకు సీబీఐకి ఎలాంటి కాలపరిమితి విధించడం లేదని తెలిపింది. సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం సహకరించాలని, రాష్ట్రం వారం లోగా ఈ ఉత్తర్వును పాటించాలని పేర్కొన్నది. అయితే దీనిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమా లేదా అన్న విషయం తెలియజేస్తూ 16 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. కాగా, ఈ కేసుకు సంబందించిన వాదనలను ఈ ఏడాది ఫిబ్రవరి 17నే ముగియగా, తీర్పును రిజర్వ్‌లో ఉంచారు.
అంతకుముందు పిటిషనర్లయిన ఎన్జీవోల తరపున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో కాంట్రాక్టులు పొందిన పలు సంస్థలకు ముఖ్యమంత్రి పెమా ఖాండూతో సంబంధాలున్నాయని అన్నారు. గత 11 ఏండ్లలో ఇదే వరుస కొనసాగుతున్నదని, బ్రాండ్ ఈగల్స్ అనే సంస్థకు 31 కాంట్రాక్టులు అప్పగించారని, ఆ సంస్థ స్వయంగా ముఖ్యమంత్రి భార్యకు చెందినదని తెలిపారు. అలాగే మరో సంస్థ ఫ్రాంటియర్ అసోసియేట్స్ కూడా ముఖ్యమంత్రికి చెందినదేనని వెల్లడించారు. ‘మొత్తం కాంట్రాక్టులు 91, వాటి విలువ రూ. 145 కోట్లు.
వారికి సొంతంగా ఉన్న కంపెనీలు 10 పైనే.’ అని 2025 జూలైలో సమర్పించిన అఫిడవిట్లో తెలిపానని, కొత్త అఫిడవిట్ ప్రకారం రూ.245 కోట్ల విలువైన 121 పనులు ఈ నాలుగు సంస్థలకు టెండర్ల ద్వారా కట్టబెట్టగా, రూ. 25 కోట్ల విలువైన 322 పనులను ఎలాంటి టెండర్లు లేకుండానే కేటాయించారని ఆయన వివరించారు. మొత్తం మీద గత 11 ఏండ్ల కాలంలో రూ.1,270 కోట్ల విలువచేసే పనులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, వారి బంధువులకే కేటాయించారని ఆరోపించారు. రాష్ట్రంలోని మొత్తం కాంట్రాక్టుల్లో 3 శాతం వీరికే కేటాయించుకున్నారన్నారు. ‘మీ క్లయింట్ల తరపున మీరు ఏం కావాలనుకుంటున్నారు?’ అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు.. తాము దీనిపై సీబీఐ దర్యాప్తును కోరుతున్నామని ప్రశాంత్ భూషణ్ అన్నారు.