న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు(Supreme Court) జలక్ ఇచ్చింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీని సుప్రీం ఆదేశించింది. జూన్ 15వ తేదీ లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు తెలిపింది. అప్లికేషన్ను ప్రాసెస్ చేసి నాలుగు వారాల్లోగా సమర్పించాలని ఎల్ అండ్ డీవోను ఆదేశిస్తున్నట్లు కోర్టు చెప్పింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పునిచ్చింది. ఆక్రమిత స్థలంలో ఆప్ కార్యాలయం కొనసాగించేందుకు చట్టపరమైన హక్కు లేదని సుప్రీం బెంచ్ తెలిపింది.
ఢిల్లీ హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజ్ అవెన్యూ కోర్టు కోసం అదనపు రూమ్లు కట్టించాలని ఆ స్థలాన్ని కేటాయించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఫిబ్రవరి 15వ తేదీన ఆ అంశం గురించి చర్చించారు. ఆ స్థలాన్ని రెండు నెలల్లోగా ఖాళీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రత్యామ్నాయ ప్లాట్ ఇస్తే, దాన్ని ఖాళీ చేస్తామని చెప్పింది.
చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దు అని, ఎలా ఓ రాజకీయ పార్టీ ఆ స్థలాన్ని ఆక్రమిస్తుందని, దురాక్రమణలన్నింటినీ తొలగిస్తామని, ఆ స్థలాన్ని హైకోర్టుకు అప్పగించాలని, దాన్ని ప్రజల కోసం వినియోగిస్తామని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.