న్యూఢిల్లీ: ఢిల్లీలో తీవ్ర నీటి కొరత(Delhi Water Crisis) ఉన్న విషయం తెలిసిందే. ఎండలు మండుతుండడంతో.. ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే హర్యానా నుంచి నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం ఢిల్లీ సర్కారు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ 137 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేయాలని తన తీర్పులో కోర్టు ఆదేశించింది. ఆ నీరు హర్యానాలోని హతినికుండ్ బ్యారేజీ ద్వారా వజీరాబాద్ బ్యారేజీకి చేరాలని కోర్టు పేర్కొన్నది. దీంతో కొంత వరకు ఢిల్లీలో నీటి కష్టాలను తొలగించవచ్చు అని కోర్టు తెలిపింది. అయితే నీటి విడుదల గురించి హర్యానాకు ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు చెప్పింది.
జూన్ ఏడో తేదీనే ఆ నీటిని రిలీజ్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కానీ హిమాచల్ వద్ద 137 క్యూసెక్కుల నీరు లేదని హర్యానా అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము కూడా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నట్లు హర్యానా తెలిపింది. కానీ 137 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు హిమాచల్ ప్రదేశ్ పేర్కొన్నది. హర్యానా నీటి అంశంలో రాజకీయాలు చేస్తోందని ఢిల్లీ ఆరోపించింది. హిమాచల్ ప్రదేశ్ సరిగ్గా 137 క్యూసెక్కుల నీటిని వదిలిందా లేదా అన్న విషయాన్ని యమునా రివర్ వాటర్ బోర్డు పర్యవేక్షించాలని జస్టిస్ పీకే మిశ్రా, కేవీ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.