న్యూఢిల్లీ, ఆగస్టు 6: విద్యుత్తు పంపిణీ కంపెనీలకు (డిస్కమ్‌లు) దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను నాలుగు సంవత్సరాలలో చెల్లించాలని సుప్రీంకోర్టు బుధవారం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించడంతో దేశవ్యాప్తంగా విద్యుత్తు వినియోగదారులపై విద్యుత్తు చార్జీల భారం పెరిగే అవకాశం ఉన్నది.
రెగ్యులేటరీ ఆస్తులుగా గుర్తించిన ఈ బకాయిలు దశబ్దాలుగా పేరుకుపోయి ఇప్పుడు దేశవ్యాప్తంగా 1.5 లక్షల కోట్లను మించిపోయాయి. ఈ మొండి బకాయిలను వసూలు చేసేందుకు నిర్ణీత కాలవ్యవధితో ఓ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్లను(ఎస్ఈఆర్సీ) జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ఈ ఆదేశాలు అమలు జరిగేందుకు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించాలని అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలెక్ట్రిసిటీ(ఏపీటీఈఎల్)ని ధర్మాసనం కోరింది. ఏళ్ల తరబడి పెరుగుతున్న రెగ్యులేటరీ ఆస్తులను పట్టించుకోనందుకు రెగ్యులేటరీ కమిషన్లు, ఏపీటీఈఎల్పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ రెగ్యులేటరీ ఆస్తులు పెరగడం వల్ల విద్యుత్తు వినియోగదారులపై భారం పడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీకి చెందిన డిస్కమ్‌లు పిటిషన్లు దాఖలు చేయడంతో ప్రారంభమైన విచారణ పరిధిని సుప్రీంకోర్టు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించింది. రెగ్యులేటరీ ఆస్తులపై అన్ని రాష్ర్టాలకు నోటీసులు జారీచేసింది.