న్యూఢిల్లీ, జనవరి 3: అదానీ గ్రూప్ షేర్ల ధరల అవకతవకల ఆరోపణలపై సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛ్ంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) దర్యాప్తు విశ్వసనీయంగానే ఉన్నదని, వేరే దర్యాప్తు అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం స్పష్టంచేసింది.
అదానీ షేర్ల ధరల నిర్ణయంలో అవకతవకలకు పాల్పడిందని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపించటంతో దేశంలో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సెబీ దర్యాప్తు జరిపి కొన్ని అంశాల్లో అదానీ గ్రూప్‌నకు క్లీన్చిట్ ఇచ్చింది. మరికొన్ని ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ కూడా అదానీ గ్రూప్‌లో అక్రమాలు జరిగినట్టు ఆధారాలు లభించలేదని తేల్చింది.
అయితే, అదానీ గ్రూప్ షేర్లలో అక్రమాలు జరిగాయని మీడియాలో వచ్చిన కథనాలను ఆధారం చేసుకొని సుప్రీంకోర్టులో కొందరు పిటిషన్లు వేశారు. వీటిని విచారించిన కోర్టు బుధవారం వాటిని కొట్టివేసింది. ‘వార్తా పత్రికలు, థర్డ్‌పార్టీ నివేదికల ఆధారంగా సెబీని ప్రశ్నించలేం. వాటిని ఇన్‌పుట్స్‌గా పరిగణించవచ్చు. సెబీ దర్యాప్తును అనుమానించడానికి అవి ఆధారాలు కావు’ కోర్టు వ్యాఖ్యానించింది.
మా అధికారం పరిమితమే
సెబీ వంటి చట్టబద్ధమైన సంస్థ అధికారాల్లో జోక్యం చేసుకోవటానికి కోర్టుకు పరిమితంగానే అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. పార్లమెంటులో ‘డెలిగేటెడ్ లెజిస్లేషన్’ ద్వారా ఏర్పడిన సెబీ విషయంలో అపరిమితంగా జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అదానీ గ్రూప్‌పై వచ్చిన 24 ఆరోపణల్లో ఇప్పటికే 22 అంశాలపై సెబీ విచారణ పూర్తిచేసిందని తెలిపింది. మిగతా అంశాలపై కూడా మూడు నెలల్లో దర్యాప్తు పూర్తిచేయాలని సెబీని ఆదేశించింది. సుప్రీం తీర్పుపై అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ సంతోషం వ్యక్తంచేశారు. ‘చివరకు సత్యమే గెలిచింది’ అని ట్వీట్ చేశారు.
అశ్రిత పక్షపాతంపై పోరాడుతాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ, జనవరి 3: అదానీ గ్రూపు అక్రమాల ఆరోపణలపై సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తీర్పు సెబీ పట్ల అసాధారణమైన ఉదారత ప్రదర్శించినట్టుగా ఉన్నదని వ్యాఖ్యానించింది. అశ్రిత పక్షపాతంతో పాటు ధరలు, ఉపాధి, అసమానతలపై దాని ప్రతికూల ప్రభావంపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అదానీ గ్రూపు సెక్యూరిటీ చట్టాల ఉల్లంఘన, స్టాక్ మ్యానిప్యులేషన్ ఆరోపణలపై సకాలంలో దర్యాప్తు చేయడంలో సెబీ విఫలమైందన్నారు. దర్యాప్తును పూర్తి చేయడానికి సెబీకి మరో మూడు నెలల సమయం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన జైరాం రమేశ్.. సెబీ పట్ల సుప్రీంకోర్టు ఉదారంగా ఉందన్నారు. తీర్పు అనంతరం అదానీ సత్యమేవ జయతే అని వ్యాఖ్యానించడంపై రమేశ్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
గత దశాబ్దకాలంగా వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ మ్యానిపులేషన్‌కు పాల్పడిన వారు సత్యమేవజయతే అని పలికితే సత్యం వెయ్యిసార్లు చచ్చిపోతుందని వ్యాఖ్యానించారు. అదానీ అక్రమాలను సెబీ చూసీ చూడనట్టు వ్యవహరించిందని, వీటిని మీడియా బయటపెట్టినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.