న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై 4 వారాల్లో స్పందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తీవ్రమైన నేరాలు ఏవన్నది కేంద్రం ముందుగా తేల్చాలని జస్టిస్ కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నోటీసులో పేర్కొన్నది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్‌పై సోమవారం సుప్రీం విచారణ చేపట్టింది. ఇదే అంశంపై మరో న్యాయవాది అశ్వినీ కుమార్ దూబే కూడా పిటిషన్ వేశారు.
న్యాయ కమిషన్ సిఫారసులు, సుప్రీంకోర్టు గతంలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కేంద్రం, ఎన్నికల సంఘం వాటిని అమలుజేయటం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన 539 ఎంపీల్లో 233 మంది (43 శాతం) నేరారోపణలు ఎదుర్కొంటున్నారని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఎంపీ తనపై 204 క్రిమినల్ కేసులున్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న సంగతి ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్’ అనే ఎన్జీవో సంస్థ వెల్లడించింది. ‘కొన్నేండ్లుగా ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వారి గెలుపు శాతం కూడా ఎక్కువగా ఉన్నది. పార్టీకి నిధులిస్తూ, ఎన్నికల ఖర్చు అంతా తామే భరిస్తామనటంతో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సైతం పార్టీలు టికెట్లు ఇస్తున్నాయ’ని పిల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు కేంద్రం వివరణ కోరుతూ.. విచారణను జూలైకి వాయిదా వేసింది.
నిజాలు రాబట్టేందుకే విచారణ హక్కు
నిందితుల నుంచి నిజాన్ని రాబట్టేందుకు కస్టోడియల్ విచారణ, వారిని ప్రశ్నించే హక్కు దర్యాప్తు సంస్థలకు చాలా ముఖ్యమని, తన ప్రవర్తన ద్వారా దీనిని నిష్ఫలం లేదా, ఆటంకపర్చడానికి నిందితుడు పాల్పడే ఏ చర్యనూ న్యాయ వ్యవస్థ ఆమోదించదని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. కస్టడీ గడువు ముగియకుండానే నిందితుడిని విడుదల చేయాలంటూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంలో దాఖలు చేసిన కేసును విచారించిన సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడి నుంచి నిజాలను రాబట్టే హక్కు దర్యాప్తు సంస్థలకు ఉన్నదని, దానిని నిందితుడు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్టు రుజువైతే, అలాంటి చర్యలను న్యాయవ్యవస్థ సహించదని ధర్మాసనం పేర్కొన్నది.
కాపీరైట్ హక్కుల పరిరక్షణకు చర్యలు
కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసార విషయంలో కాపీరైట్ హక్కుల పరిరక్షణకు యూట్యూబ్‌లో ప్రత్యేక ఏర్పాటు చేసేలా ఆదేశించాలంటూ ఆరెస్సెస్ వ్యూహకర్త కేఎన్ గోవిందాచార్య దాఖలు చేసిన పిటిషన్‌పై చర్యలు ప్రారంభించామని పేర్కొన్న సుప్రీం.. ఆయన పిటిషన్‌ను మూసివేస్తున్నట్టు పేర్కొంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధివాలా ధర్మాసనం దీనిపై మాట్లాడుతూ పిటిషనర్ లేవనెత్తిన అంశాల మేరకు వీటి పరిష్కారానికి సుప్రీం కోర్టు తన ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. కోర్టు కార్యకలాపాల లైవ్ స్ట్రీమింగ్ల విషయంలో 2018 ఇచ్చిన కోర్టు తీర్పులోని మార్గదర్శకాలను అనుసరించటంలో కోర్టుల రిజిస్ట్రీ విఫలమవుతున్నారంటూ గోవిందాచార్యులు కేసు దాఖలు చేశారు.
అగ్నిపథ్ నియామకాలు సబబే
భారత ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం చెల్లుబాటు అవుతుందని, ఈ నియామకాలు న్యాయబద్ధమైనవేనని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేస్తూ.. అగ్నిపథ్ ప్రజాప్రయోజనాలను దెబ్బతీసేలా, ఏకపక్షంగా ఎంతమాత్రం లేదని పేర్కొన్నది. వైమానిక దళంలో అగ్నిపథ్ పథకం కింద నియామకాలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్ విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
రుతుక్రమ పరిశుభ్రతపై జాతీయ నమూనా
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలకు రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణకు చేపట్టాల్పిన చర్యల గురించి ప్రామాణిక నిర్వహణా విధానాన్ని సిద్ధం చేయాలని, అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసరించే ఒక జాతీయ నమూనా తయారు చేయాలని సుప్రీం కోర్టు కోరింది. ఇది చాలా ప్రాధాన్యమున్న అంశంగా అభివర్ణించిన ఉన్నత న్యాయస్థానం.. దీని నిమిత్తం కేంద్రం శాసనకర్తలు, అధికారులను భాగస్వాములను చేయాలంది. దాని అమలుకు ఒక జాతీయ విధానాన్ని తయారు చేయాలని సుప్రీం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌లు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలలో కూడిన ధర్మాసనం కేంద్రానికి సూచించింది. జాతీయ పాలసీ తయారీ నిమిత్తం రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించింది.