Supreme Court | మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరటనిచ్చింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన కొన్నింటిని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అదనపు టీచర్ పోస్టుల సృష్టి కోసం బెంగాల్ కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని పేర్కొంది. నిపుణుల కమిటీతో చర్చలు జరిపిన తర్వాత విద్యాశాఖ అదనపు పోస్టులను సృష్టించిందని.. ఇందుకు గవర్నర్ ఆమోదం లభించిందని పేర్కొంది. అప్పుడు ఇందులో న్యాయపరమైన జోక్యం అవసరం లేదని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
25,753 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగుల నియామకానికి సంబంధించిన ఇతర అంశాలు, ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సీ, గ్రూప్ డీ స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. అయితే, 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 23 లక్షల మందికిపైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు సైతం అందించారు.
ఖాళీల ఉన్న సంఖ్య కంటే ఎక్కువ మందిని నియమించడంపై వివాదం చెలరేగింది. ఉద్దేశపూర్వకంగానే అదనపు పోస్టులను సృష్టించి అక్రమంగా నియామకాలు చేపట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు 2016 నాటి ఆ నియామక ప్రక్రియ చెల్లదంటూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో అధికారుల పాత్ర, అవకతవకలపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దీనిపై బెంగాల్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సీబీఐ దర్యాప్తుపై స్టే విధించింది. అయితే, ఇప్పటికే 25,753 మంది టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.