Supreme Court | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. ఈ కేసు విషయమై ఈడీ, సీబీఐ వైఖరిని తప్పుబట్టింది. ఏదైనా కేసు విషయమై ఏ నిందితుడినీ ఎల్లకాలం జైల్లో ఉంచకూడదని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. చార్జిషీట్ల పేరిట కాలయాపన చేస్తున్న ఈడీ, సీబీఐ తీరును ఈ సందర్భంగా ఎండగట్టింది. రెండు ఏజెన్సీల వైఖరితో వేగవంతమైన విచారణ లభించే హక్కును నిందితుడు కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్ అనేది నియమమని, జైలు అనేది మినహాయింపుగా గుర్తించాలంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం 38 పేజీల తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈడీ వైఖరిపై సుప్రీంకోర్టు గుర్రుగా ఉన్నట్టు అర్థమవుతున్నది. గడిచిన కొద్దిరోజుల్లో జరిగిన కేసుల విచారణే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. పీఎంఎల్ఏ చట్టం పేరిట ఈడీ దుందుడుకు చర్యలను ఇటీవల విమర్శించిన అత్యున్నత ధర్మాసనం.. అదే పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ నమోదు చేసిన 5 వేల కేసుల్లో నేరారోపణలు రుజువైనవి 40కి మించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా సిసోడియా బెయిల్ పిటిషన్పై ఈడీతో పాటు సీబీఐ వైఖరిని తప్పుబట్టింది.