Reservations | న్యూఢిల్లీ: దేశంలో కులాధారిత రిజర్వేషన్లు రైలు బోగీల్లా మారిపోయాయని, రైలు బోగీలోకి ఎక్కిన వారు ఇతరులు అందులోకి రావడానికి ఇష్టపడరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఏడాది చివరిలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర వెనుకబడిన తరగతులకు(ఓబీసీ) రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
పిటిషనర్ మంగేష్ శంకర్ సలసానే తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపిస్తూ రాజకీయంగా వెనుకబడ్డారా అన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన జయంత కుమార్ బంథియా సారథ్యంలోని కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ ‘ఈ దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లు రైలు బోగీల్లా మారిపోయాయి. అందులో ఉన్న వారికి ఇతరులు లోపలకు రావడం ఇష్టం ఉండదు.
ఇదో పెద్ద ఆట. పిటిషనర్ కూడా బహుశా ఇదే ఆట ఆడుతుండవచ్చు. కాని, అందరినీ కలుపుకుని పోవడమే రిజర్వేషన్ల మూల సిద్ధాంతం. మరిన్ని తరగతులను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రజలు ఉన్నారు. రిజర్వేషన్ ప్రయోజనాలు వారికి ఎందుకు దక్కవు? కొన్ని కుటుంబాలు, కొన్ని గ్రూపులకు మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనాలు దక్కుతున్నాయి’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.