న్యూఢిల్లీ: విదేశీయానం, పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండటం అనేవి భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో భాగమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ హక్కులపై ఏమైనా ఆంక్షలను విధించాలంటే, అవి తప్పనిసరిగా న్యాయంగా, నిష్పక్షపాతంగా, సహేతుకంగా ఉండాలని చెప్పింది. చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన కారణం ఉండాలని స్పష్టం చేసింది. ఈ నెల 19న ఈ తీర్పునిచ్చింది. చట్టానికి లోబడి ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించేందుకు, జీవనోపాధి, అవకాశాలను పొందేందుకు పౌరునికి గల స్వేచ్ఛ అధికరణ 21 ప్రకారం ఇచ్చిన హామీలో ముఖ్యమైన భాగమని వివరించింది.
పారిశ్రామికవేత్త మహేశ్ కుమార్ అగర్వాల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ తీర్పునిచ్చింది. 2023 ఆగస్ట్ 28న తన పాస్‌పోర్ట్ గడువు ముగిసిందని, దానిని రెన్యువల్ చేయాలని పిటిషనర్ కోరారు. ఓ కేసులో దోషిగా ఉన్న ఆయన బెయిల్‌పై ఉన్నారు. తన పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం సంబంధిత కోర్టుల నుంచి ఆయన నిరభ్యంతర పత్రాలను పొందారు. అయినప్పటికీ రెన్యువ ల్ను అధికారులు తిరస్కరించారు.