న్యూఢిల్లీ: శిక్షా కాలంలో సగం పూర్తయిన తర్వాతనే బెయిల్ దరఖాస్తు విజ్ఞప్తిని అంగీకరిస్తామంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు చట్టానికి కొత్త భాష్యం చెప్పవద్దంటూ మొట్టికాయలు వేసింది. తన శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌పై అధిక పెండింగ్ కేసుల కారణంగా సమీప భవిష్యత్తులో విచారించే అవకాశం లేనప్పుడు అతనికి తప్పక బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఓ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
హైకోర్టు ఎలాంటి ఆధారం లేని కొత్త ప్రతిపాదన కనిపెట్టడం ఆశ్చర్యానికి గురి చేసిందని గురువారం వ్యాఖ్యానించింది. చట్టాన్ని హైకోర్టు యథాతథంగా అమలు చేయాలని, బెయిల్ కోసం ముందుకు వెళ్లాలని పిటిషనర్‌ను బలవంతం చేయకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడు రెండోసారి బెయిల్ కోసం అభ్యర్థించినప్పుడు ‘జైలు శిక్షలో సగం అనుభవించిన తర్వాత మాత్రమే నిందితుడు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఈ న్యాయస్థానం స్పష్టం చేస్తున్నది’ అని హైకోర్టు పేర్కొనడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది.