న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ (CVC)లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఖాళీలను సకాలంలో, పారదర్శకంగా భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ మేరకు నోటీసులు ఇచ్చింది. ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ.. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
17 జూలై, 2020లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) విజిలెన్స్ కమిషనర్ పోస్టును భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించిందని, ఇప్పటి వరకు ఎలాంటి నియామకాలు జరుగలేదని పేర్కొంది. అలాగే జూన్ 2021లో ఏర్పడే ఖాళీలను అంచనా వేస్తూ.. మే 4, 2021న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ పోస్టు భర్తీకి డీఓపీటీ దరఖాస్తులను ఆహ్వానించిందని, దరఖాస్తు చివరి జూ 7, 2020 అయితే.. ఆ ప్రకటన అనుగుణంగా ఇప్పటి వరకు ఎలాంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదని పేర్కొంది. దీర్ఘకాలంగా ఉన్న ఖాళీలను సకాలంలో భర్తీ చేయడంలో కేంద్రం విఫలమైందని పిటిషనర్ ఆరోపించారు.
కమిషనర్లను ఎక్కువ కాలం పాటు నియమించకపోవడం, పౌరుల సమాచార హక్కుకు భంగం కలిగించడమేనని పిటిషనర్ ఆరోపించారు. జూలై 2020, మే 2021లో జారీ చేసిన ప్రకటనల ప్రకారం విజిలెన్స్ కమిషనర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్లను నియమించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసి.. మూడువారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.