Supreme Court | న్యూఢిల్లీ: భారీ సంఖ్యలో పెండింగ్లో ఉన్న క్రిమినల్ అప్పీళ్లను విచారించడానికి హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తుల నియమాకం చేపట్టాలని సుప్రీంకోర్టు మంగళవారం సూచించింది. చాలా హైకోర్టులలో పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ఒక్క అలహాబాద్ హైకోర్టులోనే 63,000 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. హైకోర్టులకు చెందిన సిట్టింగ్ జడ్జీల నేతృత్వంలో డివిజన్ బెంచీలు క్రిమినల్ అప్పీళ్లను విచారించేందుకు వీలుగా తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం కోసం 2021లో తాము ఇచ్చిన తీర్పును స్వల్పంగా మార్చగలమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యలో 80 శాతం మంది విధుల్లో ఉన్న హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తిని నియమించరాదని ధర్మాసనం తెలిపింది. అయితే ఒక సిట్టింగ్ జడ్జి నేతృత్వం వహిస్తున్న డివిజన్ బెంచీలోనే తాత్కాలిక న్యాయమూర్తి పనిచేయవలసి ఉంటుందని, ఆ బెంచీలు క్రిమినల్ అప్పీళ్లను మాత్రమే విచారించాల్సి ఉంటుందని ధర్మాసనం షరతు విధించింది.