Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత (AAP leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పునిచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు సూచించింది. పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. సుప్రీం తీర్పుతో 17 నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్న సిసోడియాకు భారీ ఊరట లభించినట్లైంది.
కాగా, మద్యం కుంభకోణం కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 17 నెలల తర్వాత ఆయనకు ఇప్పుడు ఉపశమనం లభించింది.
నూతన మద్యం పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిసోడియాను పలుమార్లు విచారించిన సీబీఐ.. 2023, ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. అప్పటినుంచి ఆయన జైలు జీవితాన్నే గడుపుతున్నారు. విచారణ సమయంలో సీఎం పదవిని ఆశజూపి ఆప్‌ను లొంగదీసుకొనేందుకు బీజేపీ కుట్రకు తెర తీసిందని అరెస్టుకు ముందు సిసోడియా ఆరోపించారు. ఆప్‌ను వీడాలని సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి చేశారని 2022 అక్టోబర్ 17న సిసోడియా తెలిపారు. బీజేపీలోకి వస్తే, ఢిల్లీ సీఎం పోస్టు ఇస్తామని ఆఫర్ చేశారని, లేకుంటే జైలుకు పంపిస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఏడాదికి పైగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నా, బీజేపీ బెదిరింపులకు వెరవకుండా సిసోడియా కోర్టుల్లో తన పోరాటాన్ని కొనసాగించారు. ఆ పోరాట ఫలితమే ఇవాళ సుప్రీం తీర్పు అని ఆప్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read..
CM Revanth Reddy | తెలంగాణను ఇకపై ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దాం: సీఎం రేవంత్ రెడ్డి
Mangalavaaram | మరో భాషలో పాయల్ రాజ్‌పుత్ మంగళవారం.. ఏ ప్లాట్ఫాంలోనంటే!