Supreme Court | న్యూఢిల్లీ, మే 19: భారతీయ మహిళా సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నాయకుడు కున్వర్ విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిమ్మల్ని చూసి యావద్దేశం సిగ్గుపడుతోందంటూ దేశ అత్యున్నత ధర్మాసనం విజయ్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. చేసిన చెత్త వ్యాఖ్యలకు విజయ్ షా చెప్పిన క్షమాపణను తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. ‘ఎటువంటి ఆలోచన లేకుండా చేసిన మీ చెత్త వ్యాఖ్యలకు మీరు ఇచ్చిన క్షమాపణ మాకు అవసరం లేదంటూ’ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
స్వయం కృతాపరాధం వల్ల ఏర్పడిన పరిస్థితి నుంచి బయటపడేందుకే విజయ్ షా మొసలి కన్నీళ్లు కారుస్తున్నట్లు తమకు అనుమానంగా ఉందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఉదంతాన్ని దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి వివరాలను వివరించేందుకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలసి కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విలేకరుల సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే.