Supreme Court | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచితాలు మంచివి కానే కాదన్న ధర్మాసనం.. వీటి వల్ల ప్రజలు పనిచేయడానికి ఎంతమాత్రం ఇష్టపడట్లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ప్రజలను ఒకవిధంగా పరాన్నజీవులుగా మార్చడం లేదా? అంటూ రాజకీయ పార్టీలను సూటిగా ప్రశ్నించింది. ఢిల్లీలో ఇండ్లులేని వారికి ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను బుధవారం విచారిస్తూ ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత హామీలు అవినీతికి మార్గాలుగా పరిణమిస్తున్నాయంటూ రిటైర్డ్ జడ్జి ఒకరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారించి ఉచిత హామీలన్నీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈసీకి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై బుధవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఉచితాలపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో టాప్ కోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్‌కు సూచించింది.
సంక్షేమ పథకాల అమలు కారణంగానే నిర్మాణ రంగంలో వలస కార్మికులు తగ్గిపోతున్నారని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు. చెన్నైలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో మంగళవారం పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘ఈ రోజుల్లో అవకాశాల కోసం కార్మికులు ఎవరూ వేరే ప్రాంతానికి వలస వెళ్లేందుకు ఇష్టపడట్లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల వస్తున్న సంపాదన దీనికి ఒక కారణం కావొచ్చు’ అని అభిప్రాయపడ్డారు. కాగా ‘భార్యను ఎంతసేపు అలానే చూస్తూ ఉండిపోతారు.. ఆదివారాలు కూడా పనిచేయండి’ అంటూ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై సుబ్రహ్మణ్యన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడం తెలిసిందే.