Supreme Court : దేశంలోని ఏ రాష్ట్ర శాసనసభలోనైనా రెండుసార్లు ఆమోదం పొందిన బిల్లులకు ఆమోదముద్ర వేసే విషయంలో భారత రాష్ట్రపతి (President of India), రాష్ట్రాల గవర్నర్ల (Governors of states) కు ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) గడువు నిర్దేశించింది. దీనిపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పులతో న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ పరోక్షంగా స్పందించింది. ఓ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అంశాన్ని ప్రస్తావించింది.
వక్ఫ్ సవరణ చట్టం నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దాంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్‌పై రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా..? అని ప్రశ్నించారు.
ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ ఇటీవల మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు. కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తిస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’ అని వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ‘ఒకవేళ సుప్రీంకోర్టు (Supreme Court) చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి’ అని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.