న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇండ్ల కూల్చివేతపై బీజేపీ సర్కారు మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరు అమానుషం, చట్టవిరుద్ధమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు ఆరు వారాల్లోగా రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కూల్చివేతలు జరిపిన తీరు మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని కోర్టు పేర్కొంది. మున్సిపల్ అధికారులకు సున్నితత్వం కొరవడిందని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ తరహాలో కూల్చివేతలు ఫ్యాషన్ కాకూడదని హితవు పలికింది. జరిగిన పరిణామాలను దురదృష్టకరంగా అభివర్ణిస్తూ చట్టవిరుద్ధంగా కూల్చివేతలు జరిగాయని, ఇందులో ప్రమేయం ఉన్నవారికి వాటిని నిర్మించే శక్తి లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
కూల్చివేతలు ప్రాథమిక హక్కులలో అత్యంత ముఖ్యమైనదైన జీవించే హక్కు పరిధిలోకి వచ్చే గూడు హక్కును కూడా అతిక్రమించారని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌కు చెందిన స్థలంగా భావించి, 2021లో ప్రభుత్వం తమ ఇండ్లను కూల్చివేసిందని బాధితులు పిటిషన్లో పేర్కొన్నారు. వీరిలో ఓ న్యాయవాది, ఓ ప్రొఫెసర్, ఇద్దరు మహిళలు ఉన్నారు. గతంలో కూల్చివేతలపై వీరు వేసిన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో వీరు సుప్రీంను ఆశ్రయించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చట్టపరమైన నిబంధనలు పాటించకుండా కూల్చివేతలు కొనసాగించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతలు చేపట్టారని, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు లేదా అప్పీలు చేసుకునే అవకాశాన్ని కూడా బాధితులకు ఇవ్వలేదని కోర్టు మండిపడింది. ఇటీవల ఇండ్ల కూల్చివేతల సందర్భంగా ఓ బాలిక పుస్తకాలు చేత పట్టుకొని పరుగెడుతున్న వీడియోను ప్రస్తావిస్తూ.. ఇది అందరినీ కలచివేసిందని తెలిపింది