న్యూఢిల్లీ: వీధికుక్కల బెడదపై దేశం పరువు పోతున్నా మీకు పట్టదా? అంటూ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై కోర్టు మార్గదర్శకాలకు సమ్మతి తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులను నవంబర్ 3న కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసినట్టు ధర్మాసనం పేర్కొన్నది. ‘దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడద కొనసాగుతున్నది. విదేశాల దృష్టిలో మన దేశ ప్రతిష్ట దెబ్బతింటున్నది’ అని జస్టిస్ నాథ్ అన్నారు. కోర్టు మార్గదర్శకాలపై సమ్మతి తెలియజేయకపోవడంతో దేశవ్యాప్తంగా వీధికుక్కల బెడద కొనసాగుతున్నదని కోర్టు పేర్కొన్నది.