Supreme Court | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇండ్లను కూల్చేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ‘బుల్డోజర్ న్యాయం’పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఇల్లు ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. 2022లో ఢిల్లీలోని జహంగిర్‌పురిలో పలు ఇండ్ల కూల్చివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌తో పాటు అల్లర్ల కేసుల్లో నిందితుల ఆస్తులను కూల్చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ‘కేవలం నిందితుడు అయినంత మాత్రాన ఇల్లు ఎలా కుల్చేస్తారు? దోషిగా తేలినప్పటికీ కూల్చేయడం కుదరదు’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ అక్రమ కట్టడమే అయినప్పటికీ చట్ట ప్రకారం నిర్దిష్ట ప్రక్రియను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను కోర్టు రక్షించబోదని, ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ‘ఓ తండ్రికి మాట వినని కొడుకు ఉండవచ్చు. ఈ కారణంతో ఇల్లు కూల్చేయడం సరైన పద్ధతి కాదు’ అని జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు.
ఈ విషయానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని, ఇవి అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. సరైన మార్గదర్శకాలు రూపొందించేందుకు గానూ సీనియర్ న్యాయవాది నచికేత జోషికి ప్రతిపాదనలు అందజేయాలని న్యాయవాదులకు సూచించింది. న్యాయవాదులతో సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు కోర్టుకు సమర్పించాలని నచికేత జోషిని కోరింది. ‘ఈ సమస్యను దేశవ్యాప్తంగా పరిష్కరించేందుకు ప్రయత్నిద్దాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. కేవలం క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్నాడనే కారణంతో ఇల్లు కూల్చడం లేదని తెలిపారు. మున్సిపల్ లేదా స్థానిక సంస్థల చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన వాటిని మాత్రమే కూల్చేస్తున్నట్టు చెప్పారు. ముందుగా నోటీసులు జారీ చేసిన తర్వాతే కూల్చివేతలు జరిగినట్టు పేర్కొన్నారు. జమాతే ఉలేమా ఇ హింద్ తరపు న్యాయవాది దుశ్యంత్ దవే వాదిస్తూ.. 2022 ఏప్రిల్‌లో అల్లర్లు జరిగిన వెంటనే ఢిల్లీ జహంగిర్‌పురిలో అల్లర్లలో పాల్గొన్నారనే ఆరోపణలతో అనేక మందివి ఇండ్లు కూల్చేశారని పేర్కొన్నారు. మరో న్యాయవాది చందర్ ఉదయ్ సింగ్ వాదిస్తూ.. ఉదయ్‌పూర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి కుమారుడు ఓ నేరంలో నిందితుడిగా ఉన్నందుకు ఆ ఇంటిని కూల్చేశారని తెలిపారు. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు గదిని యుద్ధక్షేత్రంగా మార్చొద్దని న్యాయవాదులను నిలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.