న్యూఢిల్లీ, అక్టోబర్ 10: కొన్ని రాష్ర్టాలతో మొదలుపెట్టి దశలవారీగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) చేపట్టాలని ఎన్నికల కమిషన్(EC) యోచిస్తున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల నుంచి సర్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
స్థానిక ఎన్నికలు జరిగే రాష్ర్టాలలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని ఈసీ నిర్వహించలేదని, కిందిస్థాయి ఎన్నికల సిబ్బంది ఆ ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల సర్పై దృష్టి పెట్టలేరని అధికారులు తెలిపారు. మొదటి దశలో 2026లో ఎన్నికలు జరగనున్న రాష్ర్టాలతోపాటు మరి కొన్ని రాష్ర్టాలలో సైతం సర్ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని వారు చెప్పారు.