Supreme Court : కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission), వివిధ రాజకీయ పార్టీల (Political parties) కు మధ్య విభేదాలు దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బీహార్ (Bihar) లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) తర్వాత ఈసీ ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించేందుకు విధించిన సెప్టెంబర్ 1 డైడ్లైన్ను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది.
ముసాయిదా ఓటర్ జాబితాపై ఫిర్యాదుల విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేయాలని బీహార్ లీగల్ సర్వే అథారిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 1 తర్వాత కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని, నామినేషన్ల దాఖలు చివరి తేదీవరకు సవరణలు కొనసాగుతాయని సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే విషయాన్ని కోర్టు పిటిషనర్ల వద్ద ప్రస్తావించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్రంలో ఓటరు జాబితాను సవరించి ఆగస్టు 1న ముసాయిదా జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాను ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేయడంతోపాటు ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 1 లోగా తెలియజేయాలని కోరింది. దాంతో అభ్యంతరాలను తెలియజేయాల్సిన గడువును పొడిగించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపైననే తాజాగా విచారణ జరిగింది. ముసాయిదా జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఈసీ తొలగించింది. మరోవైపు పౌరసత్వంపై అనుమానాలున్న మూడు లక్షల మందికి నోటీసులు పంపించినట్లు ఈసీ తెలిపింది.