న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్‌గాంధీ లేవనెత్తిన అంశాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయన ఆరోపణలపై ‘సిట్’తో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. బెంగళూరు సెంట్రల్‌లోని ‘మహదేవపురా’ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్‌గాంధీ ఆరోపణలు గుప్పించారు.
దీనిపై మాజీ జడ్జితో ‘సిట్’తో విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీచేయాలంటూ కాంగ్రెస్ సభ్యుడు, న్యాయవాది రోహిత్ పాండే ‘పిల్’ దాఖలు చేశారు. అయితే పిల్‌పై విచారణ చేపట్టేందుకు ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్‌దారు ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ ముందు లేవనెత్తవచ్చునని పేర్కొన్నది. చట్టపరిధిలో తగిన పరిష్కారాలను పొందాలని పిటిషనర్‌కు సూచించింది.