న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరే చట్టబద్ధ హక్కు పిటిషనర్‌కు లేదని తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజీనామా చేయడమనేది చిత్తశుద్ధికి సంబంధించిన విషయమని వివరించింది. దీనిపై చర్య తీసుకోవడమనేది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 10న ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ అపీలు దాఖలైంది. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.