న్యూఢిల్లీ, జూన్ 12: మధ్యప్రదేశ్ నుంచి తన రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవా లు చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షీ నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోలేవని, ఎన్నికల పిటిషన్ దాఖలే ఇందుకు సరై న పరిష్కారం చూపగలదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ సమయంలో న్యాయ జోక్యాన్ని చట్టపరమైన నిబంధనలు నిషేధిస్తున్నాయని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ఈ దశలో కోర్టు అధికార పరిధిని వినియోగించుకోవాలన్న మీనాక్షి ప్రయత్నా న్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అసంపూర్ణమైన ఫారమ్ 26 అఫిడవిట్‌ను దాఖలు చేయ డం, తనపై పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదు కేసు వివరాలు వెల్లడించకపోవడం అనే కారణాలతో రిటర్నింగ్ అధికారి మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించారని న్యాయస్థానం పేర్కొన్నది.
ఫిర్యాదుకు సంబంధించిన విచారణలో మీనాక్షి లిఖితపూర్వక వాంగ్మూలాలు సమర్పించారని, అందువల్ల ఆ కేసు గురించి ఆమెకు అవగాహన ఉందని కూడా రిటర్నింగ్ అధికారి తన ఉత్తర్వులో నమో దు చేశారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై మీనా క్షి ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించి లిఖితపూర్వక విజ్ఞాపన కూడా అందజేశారని ధర్మాసనం తెలిపింది. జూన్ 10న ఆమె పూర్తి స్థాయి ఎన్నికల సంఘం ముందు స్వయంగా తన వాదనను వినిపించారని, కానీ ఆమె లేఖపై ఎటువంటి ఉత్తర్వు జారీకాలేదని కోర్టు పేర్కొన్నది. మీనాక్షీ నటరాజన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదన వినిపిస్తూ వివాదానికి ఆధారమైన ఫిర్యాదు కేసులో ఎటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, అభియోగాలు కూడా నమోదు చేయలేదని చెప్పారు. కాబట్టి నామినేషన్‌ను తిరస్కరించడం చట్టవిరుద్ధమని వాదించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటం కం కలిగించే బదులు సహాయపడే అసాధారణ పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని పేర్కొంటూ మొహిందర్ సింగ్ గిల్, అశోక్‌కుమార్ వంటి తీర్పులను సింఘ్వీ ఉదహరించారు.
ఎన్నికల పిటిషన్ ద్వారానే పరిష్కారం
ఈ అభ్యర్థనను ఎన్నికల సంఘం, ఎన్నికైన అభ్యర్థి, ఇతర ప్రతివాదులు వ్యతిరేకించారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఒక చట్టబద్ధమైన హక్కని, తిరస్కరణకు గురైన అభ్యర్థికి ఎన్నిక ల పిటిషన్ ద్వారా మాత్రమే పరిష్కారం ఉం టుందని వాదించారు. ఫారమ్ 26 ప్రకారం పెండింగ్‌లో ఉన్న అన్ని క్రిమినల్ కేసులను వెల్లడించాల్సి ఉంటుందని, ఎన్నికలు జరుగుతున్నపుడు నామినేషన్ తిరస్కరణను సవాలు చేయడానికి ఆర్టికల్ 32 గానీ, ఆర్టిక్ 226 గానీ ఉపయోగించలేమని వాదించారు. వాదప్రతివాదనలను విన్న అనంతరం ధర్మాసనం మీనాక్షీ నటరాజన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ నామినేషన్ల తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల పిటిషన్ దాఖలు చేసి పరిహారాన్ని పొందవచ్చని తెలిపింది. భవిష్యత్తులో మీనాక్షి దాఖ లు చేయాలనుకునే ఏ ఎన్నికల పిటిషన్‌పైనా అవి ప్రభావం చూపబోవని స్పష్టంచేసింది.
ఏదీ దాచిపెట్టలేదు: మీనాక్షి
తన రాజ్యసభ నామినేషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మీనాక్షీ నటరాజన్ కొంత అసంతృప్తికి గురయ్యారు. ఎన్నికల సంఘం వైఖరి మనందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు గురించి నేను వ్యాఖ్యలు చేయదలచుకోలేదు అని విలేకరులతో మాట్లాడుతూ ఆమె అన్నారు. తన రాజ్యసభ నామినేషన్ పత్రాల్లోని ఫారమ్ 26లో సమాచారాన్ని దాచిపెట్టారన్న ఆరోపణను ఆమె తోసిపుచ్చారు. ఎన్నికల సంఘం రాజీపడిందని ఆమె ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, గతంలో నమోదైన శిక్షలకు సంబంధించిన అంశాలే ఈ వివాదానికి కారణమని ఆమె చెప్పారు. తనపై కేవలం ఒక చట్టపరమైన నోటీసు మాత్రమే ఉందని, ఏ న్యాయస్థానమూ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంటూ ఆ రెండు అంశాలు తనకు వర్తించవని తాను ఆ ఫారమ్ సరిగ్గానే వెల్లడించానని ఆమె స్పష్టం చేశారు. ఫారమ్ 26లో వ్యక్తిగత ఫిర్యాదును వెల్లడించాలని కోరే కాలమ్ లేదని ఆమె చెప్పారు. ఒకవేళ అలాంటి నిబంధన ఉండి ఉంటే తాను ఆ సమాచారాన్ని ఇచ్చి ఉండే దానినని ఆమె తెలిపారు. తన నామినేషన్ పత్రాల్లోఎటువంటి లోపాలు గానీ సమాచారాన్ని దాచిపెట్టడం గానీ జరుగలేదని ఆమె స్పష్టం చేశారు. ఫారమ్ 26 కింద కోరిన సమాచారాన్ని సక్రమంగా సమర్పించానని ఆమె తెలిపారు.