Supreme Court : సైబర్ నేరస్థుల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయడం కోసం కృత్రిమమేధ (AI) ను ఎందుకు వాడట్లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ని సోమవారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిజిటల్ అరెస్టు (Digital arrest) కేసుల విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం (Supreme court) ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుల్లో పాన్ ఇండియా స్థాయిలో ఒకేతరహాలో దర్యాప్తు ఉండాలని సూచించింది.
ఈ కేసులలో సీబీఐ విచారణకు సమ్మతి తెలియజేయాలని పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచనలు చేసింది. కాగా, గత కొంతకాలంగా దేశంలో డిజిటల్ అరెస్టులు కలకలం సృష్టిస్తున్నాయి. తాము ప్రభుత్వ అధికారులమంటూ నేరగాళ్లు ఆడియో, వీడియో కాల్స్ చేసి, బాధితులను భయపెట్టి, డిజిటల్ అరెస్టు చేస్తున్నారు.
బెదిరించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. డిజిటల్ అరెస్టు కారణంగా తాను రూ.కోటి కోల్పోయానని హర్యానాకు చెందిన ఓ వృద్ధ మహిళ వేసిన కేసుపై గత కొన్నిరోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది.