న్యూఢిల్లీ, జనవరి 24: పీఎఫ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నామినీలకు శుభవార్త తెలిపింది. చనిపోయిన వ్యక్తి భవిష్య నిధి(పీఎఫ్), బీమా, బా్ంయకుల్లో దాచుకున్న డబ్బు కోసం నామినీని ఇబ్బంది పెట్టొద్దని, వివరాలు స్పష్టంగా ఉంటే సక్సెషన్ సర్టిఫికెట్ కావాలని ఒత్తిడి తీసుకు రావొద్దని, ఇలాంటి విషయాల్లో కోర్టుకు రావాల్సిన అసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 7న ఒక చారిత్రక తీర్పు ఇచ్చింది.
జనరల్ ప్రావిడెండ్ ఫండ్ (జీపీఎఫ్) నిల్వ రూ.5 వేల కన్నా ఎక్కువగా ఉంటే నామినీ ఎలాంటి వీలునామా, వారసత్వ ధ్రువీకరణ, పరిపాలనా లేఖలు సమర్పించకుండానే ఆ మొత్తాన్ని తీసుకునే హక్కు ఉందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వం నామినీ నుంచి అలాంటి పత్రాల కోసం పట్టుబడితే నామినీ చట్టబద్ధమైన వారసుడు కాదని భావించాల్సి వస్తుందని, అది నామినేషన్ మొత్తం ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని దెబ్బ తీస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కేసు వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్లో ఒక జీపీఎఫ్ ఖాతాదారుడు ఇటీవల మరణించాడు. అతని జీపీఎఫ్ ఖాతాలో తన సోదరుడు మండల్‌ను నామినీగా పేర్కొన్నాడు. దీంతో మండల్ వారసత్వ ధ్రువీకరణ పత్రం సమర్పించినా అతనికి జీపీఎఫ్ మొత్తాన్ని ఇవ్వడానికి జీపీఎఫ్ సంస్థ నిరాకరించింది.
దీన్ని సవాల్ చేస్తూ అతడు ట్రైబ్యునల్, కలకత్తా హైకోర్టులను ఆశ్రయించగా, రెండూ కూడా అతడికి అనుకూలంగానే తీర్పు చెప్పాయి. జీపీఎఫ్ మొత్తాన్ని మండల్‌కు చెల్లించాలని ఆదేశించాయి. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జీపీఎఫ్ మొత్తం రూ.5 వేల కంటే ఎక్కువగా ఉంటే నామినీకి వారసత్వ ధ్రువీకరణ పత్రం తదితరమైనవి అవసరమని చట్టం పేర్కొన్నప్పటికీ, అది 1925లో రూపొందించినదని సుప్రీం కోర్టు పేర్కొంది.