SC Reservations | న్యూఢిల్లీ, జనవరి 9 : రిజర్వేషన్ ప్రయోజనాలను పొంది, ఇతరులతో పోటీ పడగలిగే స్థితిలో ఉన్న వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలా అనేది శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకునే అధికారాలు రాష్ర్టాలకు ఉన్నాయని గత ఆగస్టులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీల్లోనూ క్రిమీలేయర్ గుర్తించేందుకు రాష్ర్టాలు ఒక విధానాన్ని రూపొందించాలని ఈ ధర్మాసనంలో భాగమైన జస్టిస్ బీఆర్ గవాయి అప్పుడే ఒక ప్రత్యేక తీర్పు ఇచ్చారు. ఆరు నెలలైనా రాష్ర్టాలు ఈ విధానాన్ని రూపొందించలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను గురువారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ‘గత 75 ఏండ్లను పరిగణనలోకి తీసుకొని, ఇప్పటికే కోటా ప్రయోజనాలు పొంది, ఇతరులతో పోటీ పడగల వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలని మేము ఇప్పటికే మా అభిప్రాయాన్ని స్పష్టం చేశాం. కానీ, ఈ నిర్ణయం తీసుకోవాల్సింది కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలే’ అని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. రాష్ర్టాలు విధానాన్ని రూపొందించవని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ‘శాసనసభ్యులు ఉన్నారు, వారు చట్టం చేయగలరు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాల్సిందిగా న్యాయవాది కోరగా.. కోర్టు అంగీకరించింది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)-అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యేందుకు గతంలో మూడు ప్రయత్నాలకు అవకాశం ఉండేది. జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. గత ఏడాది నవంబరు 5న జేఈఈ-అడ్వాన్స్డ్, 2025 కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో మూడు ప్రయత్నాలు చేయవచ్చునని చెప్పింది. కానీ అదే నెల 18న ఇచ్చిన నోటిఫికేషన్లో ఈ సంఖ్యను రెండుకు కుదించింది. ఇది నిరంకుశత్వమని, విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 10న దాఖలైన ఇదే తరహా పిటిషన్‌తో కలిపి విచారణ జరపబోతున్నది.
స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించడానికి తిరస్కరిస్తూ 2023 అక్టోబరులో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ఈ తీర్పులో తప్పులు లేవని, దానిలో జోక్యం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులు చాంబర్స్‌లో పరిశీలించి, ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ పిటిషన్లపై ఓపెన్ కోర్టులో విచారణకు గతంలోనే తిరస్కరించిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమ కోహ్లీ ఇచ్చిన తీర్పును, ఈ మెజారిటీ తీర్పునకు మద్దతుగా జస్టిస్ పీఎస్ నరసింహ ఇచ్చిన తీర్పును పరిశీలించామని, ఈ తీర్పుల్లో ఎటువంటి తప్పులు లేవని వివరించింది.