పీఎంఎల్ఏ ఉద్దేశం ఓ వ్యక్తిని జైల్లోనే ఉంచడం కాదు. హైకోర్టు క్వాష్ చేసిన తరువాత కూడా ఆ వ్యక్తిని జైలులోనే ఉంచాలన్న ధోరణిని కొనసాగిస్తే ఇక ఏం చెప్పగలం? 498ఏ కేసుల్లో ఏం జరుగుతున్నదో చూడండి. పీఎంఎల్ఏ కూడా అలాగే దుర్వినియోగమవుతున్నదా?
Supreme Court | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: నిందితులను జైలులో పెట్టేందుకు హవాలా నిరోధక చట్టాన్ని(పీఎంఎల్ఏ) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దుర్వినియోగం చేస్తున్నదా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 498ఏ సెక్షన్(వరకట్న నిరోధక చట్టం) లాగానే పీఎంఎల్ఏ కూడా దుర్వినియోగం అవుతున్నదా? అని నిలదీసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి అరుణ్‌పతి త్రిపాఠీ బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఉత్తర్వును ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసినప్పటికీ నిందితుడిని ఇంకా కస్టడీలో ఉంచడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది.
‘పీఎంఎల్ఏ ఉద్దేశం ఓ వ్యక్తిని జైల్లోనే ఉంచడం కాదు. హైకోర్టు క్వాష్ చేసిన తరువాత కూడా ఆ వ్యక్తిని జైలులోనే ఉంచాలన్న ధోరణిని కొనసాగిస్తే ఇక ఏం చెప్పగలం? 498ఏ కేసుల్లో ఏం జరుగుతున్నదో చూడండి. పీఎంఎల్ఏ కూడా అలాగే దుర్వినియోగమవుతున్నదా?’ అని వ్యాఖ్యానించింది. త్రిపాఠీకి బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరఫు న్యాయవాది వాదనపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘హైకోర్టు క్వాష్ చేసిన విషయం ఈడీకి తెలిసి ఉండటం ఆశ్చర్యపరుస్తున్నది. ఈడీ అధికారులకు సమన్లు ఇవ్వాల్సి వస్తుంది. మనం ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాం?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పీఎంఎల్ఏ కేసుల విచారణలో ఈడీ వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవల సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓ హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేను 15 గంటల పాటు విచారించడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా తప్పుబట్టింది. ఈడీ తీరు అమానవీయమని, అహంకారపూరితమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ మహిళ బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించగా, ఈడీ వాదనలు పీఎంఎల్ఏ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఈ వైఖరిని సహించబోమని సుప్రీంకోర్టు మండిపడింది. హవాలా కేసుల్లో నేర నిరూపణ తక్కువగా ఉండటంపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఈడీ కొంత శాస్త్రీయ విచారణ జరపాలని సూచించిన సంగతి తెలిసిందే.