Supreme Court : దేశంలో విద్వేష, రెచ్చగొట్టే ప్రసంగాల విషయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా ప్రసంగాల్ని నియంత్రించడానికి కొత్త చట్టాలేమీ అవసరం లేదని, ఇప్పటికే ఉన్న చట్టాలు సరిపోతాయని వ్యాఖ్యానించింది. విద్వేష, రెచ్చగొట్టే ప్రసంగాలను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. మతపరమైన, రెచ్చగొట్టే కంటెంట్‌ను అడ్డుకునేలా నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలని పిటిషన్లో కోరారు.
దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరిపి, తాజా వ్యాఖ్యలు చేసింది. విద్వేష ప్రసంగాల్ని ఆపేందుకు కొత్త మార్గదర్శకాలు అవసరం లేదని తెలిపింది. ఈ అంశంలో చట్టబద్ధమైన శూన్యత లేదని అభిప్రాయపడింది. ఇప్పటికే విద్వేష, రెచ్చగొట్టే ప్రసంగాలపై తగిన క్రిమినల్ అభియోగాలు, నేరాలు, శిక్షలు చట్టాల్లో ఉన్నాయని కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఉన్న క్రిమినల్ చట్టాల్లో దీనికి తగిన మార్గదర్శకాలు, శిక్షలు ఉన్నాయని, అవి సరిపోతాయని కోర్టు తెలిపింది. ఈ ప్రసంగాల్ని అడ్డుకునేందుకు కొత్త చట్టాలు అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.
అలాగే, ఈ విషయంలో చట్టాలు చేసి, మార్గదర్శకాలు జారీ చేసే అధికారం రాజ్యాంగపరంగా న్యాయవ్యవస్థకు లేదని వెల్లడించింది. ఈ విషయంలో చట్టాలు చేయాలని వ్యవస్థల్ని కోర్టు ఆదేశించగలదు కానీ, అందులోకి దిగి చట్టాలు చేసే అధికారం కోర్టులకు లేదని తెలిపింది. అందువల్ల ఈ విషయంలో నూతన మార్గదర్శకాలు విడుదల చేయలేమని ప్రకటించింది. విద్వేష ప్రసంగాల్ని అడ్డుకునేందుకు చట్టంలో ఐపీసీ సెక్షన్ల ప్రకారం పలు చట్టాలు అమల్లో ఉన్నట్లు కోర్టు తెలిపింది.
మతపరమైన, ప్రజా శాంతికి భంగం కలిగించే వాటిని ఆయా చట్టాలు అడ్డుకుంటున్నాయని కోర్టు చెప్పింది. ఇలాంటి కేసుల విషయంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వంటివి చేస్తే ఫిర్యాదుదారులు పోలీసు ఉన్నతాధికారుల్ని లేదా న్యాయవ్యవస్థను సంప్రదించాలని సూచించింది.