(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విధుల్లో ఉన్న జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించడం తీవ్ర దుమారం రేపింది. బెంగాల్ పాలనా యంత్రాంగంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటనను నేరపూరిత వైఫల్యంగా అభివర్ణించిన ధర్మాసనం.. ఈ ఉదంతంపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలంటూ ఎన్నికల సంఘానికి (ఈసీ) సూచించింది. అలాగే సర్ ప్రక్రియకు అడ్డంకులు కలుగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని ఈసీని ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సర్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. అయితే, సర్ పేరిట పెద్దయెత్తున లక్షిత ఓటర్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలతో మాల్దా జిల్లాలోని ఓ గ్రామంలో బుధవారం పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలో సర్ విధుల్లో ఉన్న ముగ్గురు మహిళలతో కలిపి మొత్తం ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో నిర్బంధించారు. సమాచారం అందుకొన్న భద్రతా సిబ్బంది అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకొని జ్యుడీషియల్ అధికారులను రక్షించారు. ఈ క్రమంలో కొందరిపై లాఠీఛార్జ్ చేశారు. అయితే, నిర్బంధంలో ఉన్న జ్యుడీషియల్ అధికారులను రక్షించడంలో రాష్ట్ర పాలనా యంత్రాంగం తీవ్ర అలసత్వం వహించినట్టు పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించడంపై తీవ్ర దుమారం రేగడంతో సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ విషయం తనకు తెలియదన్న ఆమె.. ప్రస్తుతం పరిపాలన తన చేతుల్లో లేదని వెల్లడించారు. ‘రాష్ట్రంలో శాంతి-భద్రతలను ఈసీ నియంత్రిస్తున్నది.

వాళ్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట వింటున్నారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో అధికారులందరినీ మార్చేస్తు’న్నారని మమత ఆరోపించారు. మాల్దాలో జరిగిన ఘటన బీజేపీ కుట్రగా అభివర్ణించిన మమత.. ఎన్నికలను రద్దు చేయించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపించారు.