న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఒక పక్క భారత్ వేదికగా కృత్రిమ మేధ (ఏఐ)పై శిఖరాగ్ర సమావేశం-2026 నిర్వహిస్తూ దాని గొప్పతనం, ప్రభావంపై విస్తృతంగా చర్చ జరుగుతున్న క్రమంలో దాని అతి వినియోగం వల్ల ఏర్పడే పరిణామాల రెండో కోణంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా న్యాయవాదులు ఎడాపెడ ఏఐ టూల్స్‌ను ఉపయోగించడాన్ని ప్రశ్నించింది. న్యాయవాదులు ఏఐని ఉపయోగించి పిటిషన్ల డ్రాఫ్ట్‌లను తయారు చేస్తున్న విధానం పెరుగుతుండటం పట్ల చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని జస్టిస్‌లు వీబీ నాగరత్న, జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
‘కొంతమంది న్యాయవాదులు పిటిషన్లను రూపొందించడానికి ఏఐని ఉపయోగించడం ప్రారంభించారని గ్రహించి మేం ఆందోళన చెందుతున్నాం. ఇది పూర్తిగా అనవసరం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఏఐని వినియోగిస్తూ ‘మెర్సీ వర్సెస్ మ్యాన్‌కైండ్’ లాంటి ఉనికిలో లేని తీర్పులను కూడా ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నది. అలాంటి వాటిని తనిఖీ చేయడం చాలా కష్టతరంగా ఉందని, కొన్ని తీర్పులను ప్రస్తావించడం సబబుగానే ఉన్నప్పటికీ, అందులో నకిలీ కొటేషన్లను కూడా ఆపాదిస్తున్నారని, ఇది న్యాయమూర్తులకు అదనపు భారంగా మారిందని తెలిపింది.