దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ వివాదంపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీయేకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బాధ్యత గల సంస్థగా మీరు న్యాయంగా వ్యవహరించాలి.
తప్పు ఏదైనా జరిగితే, అవును జరిగిందని ఒప్పుకోవాలి. అప్పుడే మీ పనితీరుపై విశ్వాసం కలుగుతుంది’ అని న్యాయస్థానం స్పష్టంచేసింది. మరోవైపు నీట్ అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆప్ నిరసన చేపట్టగా.. హైదరాబాద్ రాజ్‌భవన్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది.
న్యూఢిల్లీ, జూన్ 18: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ పరీక్ష వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ యూజీ-2024 పరీక్ష నిర్వహించే క్రమంలో ఎవరి వైపు నుంచి అయినా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించకూడదని, దాన్ని సంపూర్ణంగా, సకాలంలో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ), కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు అభ్యర్థులు ఎంతో కష్టపడి చదువుతారని, ఆ శ్రమను మర్చిపోకూడదని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఒక వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే.. సమాజానికి ఎంత హానికరమో ఊహించుకోవాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో పలువురు విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం సహా పలు అంశాలపై దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
అలా చేస్తేనే మీ పనితీరుపై విశ్వాసం!
విచారణ సందర్భంగా నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ‘పరీక్ష నిర్వహణ బాధ్యత గల సంస్థగా.. న్యాయంగా ఉండాలి. తప్పు ఏదైనా జరిగితే, అవును తప్పు జరిగింది.. మేం ఈ చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పాలి. కనీసం అదైనా మీ పనితీరుపై విశ్వాసం కలిగిస్తుంది’ అని న్యాయస్థానం ఎన్టీఏకు హితవు పలికింది. సకాలంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడిన కోర్టు.. తదుపరి విచారణను జూలై 8కు వాయిదా వేసింది.
నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్, ఇతర పెండింగ్ పిటిషన్లతో కలిసి ఆ రోజున విచారణ చేపడుతామని తెలిపింది. తాజా పిటిషన్లపై రెండు వారాల్లోగా స్పందన తెలియజేయాలని ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. నీట్ పేపర్ లీకేజ్, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరుపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత వారం కేంద్రం, ఎన్టీఏలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, నీట్ పరీక్షలో పలు చోట్ల అక్రమాలు జరుగడం వాస్తవమేనని, రెండు చోట్ల వెలుగులోకి వచ్చాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ తాజాగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఎన్టీఏ ఉన్నతాధికారులైనా.. తప్పు చేసినట్టు తేలితే, ఎవరినీ వదిలేని లేదని అన్నారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలి
నీట్ పరీక్ష అక్రమాలకు వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టీ నేతలు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిందని, అభ్యర్థులు రోజుకు 16-18 గంటలపాటు ఎంతో కష్టపడి చదివారని పేర్కొన్నారు. పరీక్ష రాయడానికి ఎవరైనా లంచం ఇచ్చినట్టు ఇంతకుముందు ఎప్పుడూ వినలేదని ఆయన అన్నారు. పరీక్ష జరిగిన మే 5కు ముందు రోజున బీహార్‌లో కొంత మంది విద్యార్థుల చేతికి నీట్ ప్రశ్నాపత్రం అందిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
విద్యార్థుల భవిష్యత్తుపైనా మౌనమేనా?
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నీట్ వివాదంపై ప్రధాని మోదీ మౌనంగా ఉండడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీహార్, గుజరాత్, హర్యానాలో జరిగిన అరెస్టులు నీట్ పరీక్షలో ఒక ప్రణాళిక ప్రకారం వ్యవస్థీకృత నేరం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు పేపర్ లీకేజీలకు కేంద్రంగా మారాయని ఆరోపించారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలో జరిగిన అక్రమాలపై ప్రధాని మోదీ తనదైన శైలిలో మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. పేపర్ లీకులకు వ్యతిరేకంగా బలమైన పాలసీలు తీసుకొచ్చేలా యువత గొంతుకను వీధుల నుంచి పార్లమెంట్ వరకు వినిపిస్తామని రాహుల్ పేర్కొన్నారు.
ఎన్టీఏ వాదనను తోసిపుచ్చిన ఎన్సీఈఆర్టీ
నీట్ యూజీ-2024 పరీక్షలో సిలబస్ పరిధి దాటి ప్రశ్నలు ఇచ్చారన్న ఎన్టీఏ వాదనను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) తోసిపుచ్చింది. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లాని సోమవారం మైసూర్‌లోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఆర్ఐఈ)లో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఏ ప్రకటనలో వాస్తవం లేదన్నారు. 2020 నుంచి ఎన్సీఈఆర్టీ రివైజ్డ్ పుస్తకాలు ప్రింట్, ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రశ్నలను రూపొందించిన వారు 2020 ముందు నాటి పుస్తకాలను ఎందుకు రిఫర్ చేశారో తమకు తెలియదని ఆయన తెలిపారు.