న్యూఢిల్లీ, జూన్ 20: నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేయాలని, అక్రమాలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏలకు నోటీసులు జారీచేసింది. పిటిషన్లపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. నీట్ వివాదంపై వివిధ హైకోర్టుల్లో పెండింగ్ ఉన్న పిటిషన్లపై ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది. అయితే నీట్ కౌన్సెలింగ్‌పై స్టే విధించలేమని మరోసారి స్పష్టం చేసింది.
తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 8కి వాయిదా వేసింది. గత నెల 5న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని 20 మంది అభ్యర్థులు పిటిషన్ వేశారు. కొత్త పరీక్ష నిర్వహించేలా ఎన్టీఏకు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థుల తరపు న్యాయవాది ధీరజ్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీక్, ఇతరత్రా అంశాలపై హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఎన్టీఏ చేసిన అభ్యర్థనపై కూడాధర్మాసనం సంబంధిత కక్షిదారులకు నోటీసులు ఇచ్చింది.