BS Yediyurappa | కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై దాఖలైన పోక్సో కేసు విచారణపై స్టే విధించింది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను యడ్యూరప్ప సుప్రీంకోర్టుల్ సవాల్ చేశారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంలో మళ్లీ కర్నాటక హైకోర్టు విచారించాలని ఆదేశించాలా? వద్దా? అన్న అంశానికి మాత్రమే నోటీసులు జారీ చేసినట్లు బెంచ్ స్పష్టం చేసింది.
పోక్సో చట్టం కింద చార్జిషీట్‌ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని సమర్థిస్తూ.. విచారణకు హాజరు కావాలని ఆదేశించిన కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ యడ్యూరప్ప స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సీజేఐ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. ఈ కేసులో ఏం జరుగలేదని చూపించే కీలకమైన ఆధారాలను హైకోర్టు విస్మరించిందని యడ్యూరప్ప తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. ఆయన నాలుగు సార్లు సీఎంగా పని చేశారన్నారు. 2024 మార్చి 14న ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. సహాయం కోసం యడ్యూరప్ప ఇంటికి వెళ్లిన సమయంలో తన 17 సంవత్సరాల కుమార్తెను లైంగికంగా వేధించారని, డబ్బు ఇచ్చి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని సదరు మహిళ ఆరోపించింది.
మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూలై 4, 2024న ట్రయల్ కోర్టు యడ్యూరప్పతో పాటు మరో ముగ్గురిపై కేసును అణగదొక్కేందుకు ప్రయత్నించారని, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారంటూ అభియోగాలను నమోదు చేసింది. ఆ తర్వాత కర్నాటక హైకోర్టు కేసును పునః పరిశీలించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఫిబ్రవరి 18న ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు యడ్యూరప్పతో పాటు ముగ్గురిని మార్చి 15న తన ఎదుట కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఇచ్చిన ఆదేశాలతో పాటు ఫిర్యాదు సైతం కొట్టివేయాలని యడ్యూరప్ప హైకోర్టులో సవాల్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమేనని మాజీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కేసును కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో మాజీ సీఎం సుప్రీంకోర్టు తలుపు తట్టారు.