Supreme Court | జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాల సరిహద్దుల నుంచి కిలోమీటర్ పరిధిలోని అన్ని మైనింగ్ కార్యకలాపాలను సుప్రీంకోర్టు గురువారం నిషేధించింది. ఇలాంటి కార్యకలాపాలు అటవీ జీవులకు హానికరమని పేర్కొంది. జార్ఖండ్‌లోని సారంద వన్యప్రాణుల అభయారణ్యం (SWL), ససంగ్దాబురు కన్జర్వేషన్ రిజర్వ్ (SCR)కు సంబంధించిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్నది. రక్షిత ప్రాంతాల నుండి ఒక కిలోమీటరు పరిధిలోని మైనింగ్ కార్యకలాపాలు వన్యప్రాణులకు ప్రమాదకరమని కోర్టు స్పష్టం చేసింది. గోవా ఫౌండేషన్ కేసులో ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది. కానీ, అలాంటి ఆదేశాలను ప్రస్తుతం మొత్తం దేశానికి మార్గదర్శకాలను విస్తరించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాల సరిహద్దుల నుంచి ఒక కిలోమీటరు పరిధిలో మైనింగ్‌ను ఇకపై అనుమతించొద్దని కోర్టు ఆదేశించింది.
ఈ ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రాంతంలోని గిరిజనుల హక్కులను అటవీ హక్కుల చట్టం కింద తప్పనిసరిగా రక్షించాలని కూడా స్పష్టం చేసింది. ఈ విషయంలో సమగ్ర ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించింది. గతంలో సారండా ప్రాంతాన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్‌గా ప్రకటించడంపై నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం జార్ఖండ్ ప్రభుత్వానికి చెప్పింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లా సారండా, ససంగ్దబురు పర్యావరణపరంగా గొప్ప అటవీ ప్రాంతాలని.. వాటిని వన్యప్రాణుల అభయారణ్యంగా, రక్షిత రిజర్వ్‌గా ప్రకటించాలన్న ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో 31,468.25 హెక్టార్ల అసలు ప్రతిపాదనతో పోలిస్తే.. ప్రస్తుతం 57,519.41 హెక్టార్ల విస్తీర్ణాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొంది.