న్యూఢిల్లీ: సరిహద్దు వద్ద నిరసనకు దిగిన రైతులు హింసాత్మక చర్యలకు దిగకుండా గాంధేయ మార్గాన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు కోరింది. రైతుల డిమాండ్ల సాధనకు 17 రోజులుగా దీక్ష చేస్తున్న జగ్జీత్ దల్లేవాల్‌కు తక్షణం వైద్య సహాయం అందించాలని కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలను ఆదేశించింది. పంజాబ్-హర్యానా సరిహద్దు వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న దల్లేవాల్ వద్దకు ప్రభుత్వ ప్రతినిధులను పంపించాలని జస్టిస్‌లు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
అతనికి వైద్య సహాయం అందించాలని, నిరాహార దీక్ష కారణంగా అతని ప్రాణాలకు ముప్పు ఉన్నందున దీక్ష విరమణకు ఒప్పించాలని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో అతడిని బలవంతం చేయకుండా ఒప్పించాలని సూచించింది. సుప్రీం కోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసిందని, ఆందోళన చేస్తున్న రైతులతో అది చర్చించి, తన సిఫార్సులను న్యాయస్థానానికి అందజేస్తుందని, దానిని తాము ప్రభుత్వం ముందు ఉంచుతామని న్యాయస్థానం తెలిపింది. రైతులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని సూచించింది.